న్యూఢిల్లీ: గడిచిన పదేళ్లలో భారత అణుశక్తి సామర్థ్యం రెండింతలు అయినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Union Minister Jitendra Singh)తెలిపారు. ఇవాళ లోక్‌సభలో ఆయన మాట్లాడారు. పదేళ్లలో 4780 మెగావాట్ల నుంచి 8081 మెగావాట్లకు అటాక్ పవర్ కెపాసిటీ పెరిగినట్లు చెప్పారు. అణుశక్తి శాఖ, అంతరిక్ష శాఖలకు చెందిన మంత్రి జితేంద్ర మాట్లాడుతూ.. 2014 నుంచి అటామిక్ పవర్ రంగంలో భారత్ కీలక మార్పులు చూసిందన్నారు. గడిచిన 60 ఏళ్లలో సాధించలేనిది, గత రెండు దశాబ్ధాల్లో సాధించినట్లు మంత్రి తెలిపారు. ఇక 2031-32 నాటికి అణుశక్తి ఉత్పాదక సామర్థ్యం 22,480 మెగావాట్లకు పెరగనున్నట్లు జితేంద్ర అంచనా వేశారు.
ఇది సాంకేతిక నిపుణత్వమే కాకుండా, దీనికి రాజకీయ కాంక్ష కూడా తోడైనట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం 50 శాతం విద్యుత్తును స్థానిక రాష్ట్రాలకు, 35 శాతం పక్క రాష్ట్రాలకు, 15శాతం జాతీయ గ్రిడ్‌కు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఫెడరల్ స్పూర్తితో ఈ ఫార్ములా అమలు చేస్తున్నట్లు చెప్పారు. కూడంకుళం, కల్పక్కం పవర్ జనరేటర్ యూనిట్లు 2014 తర్వాత భారీ స్థాయిలో అణుశక్తిని ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు.
అటామిక్ ఎనర్జీని చాలా శాంతియుగా, ఆవిష్కృత పద్ధతుల్లో వినియోగిస్తున్నట్లు చెప్పారు. దేశంలో 21 శాతం థోరియం నిల్వలు ఉన్నట్లు చెప్పారు. యురేనియంపై ఆధారపపడం తగ్గించేందుకు భవానీ ప్రాజెక్టు ద్వారా థోరియం నిల్వలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.