Ex Trishul : భారత త్రివిధ దళాలు (Tri forces) ఉమ్మడిగా ‘త్రిశూల్ (Trishul)’ విన్యాసాలకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ అప్రమత్తమైంది. తన గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటమ్ జారీ చేసింది. అక్టోబరు 30 నుంచి నవంబరు 10 వరకు పాక్ సరిహద్దులోని సర్క్రీక్ ప్రాంతంలో భారత త్రివిధ దళాలు పెద్దఎత్తున విన్యాసాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి.
ఈ క్రమంలో పాక్ తన గగనతలంలోని వైమానిక మార్గాలను పరిమితం చేసింది. విశ్లేషకుడు డామియన్ సైమన్ దీనికి సంబంధించి ఒక ఉపగ్రహ చిత్రాన్ని షేర్ చేశారు. 28వేల అడుగుల ఎత్తు వరకు విన్యాసాలు చేసేందుకు గగనతలాన్ని రిజర్వ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత త్రివిధ దళాలు కలిసి ఉమ్మడిగా ఇంత పెద్ద కసరత్తు నిర్వహించడం గమనార్హం.
ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాలు, స్వావలంబనను ప్రదర్శించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇలాంటి విన్యాసాలు సాధారణ సన్నద్ధత చర్యలే అయినప్పటికీ.. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సరిహద్దును నిశితంగా గమనిస్తున్నామని చెప్పేందుకే పాక్ తాజాగా నోటమ్ జారీ చేసినట్లు తెలుస్తోంది.