న్యూఢిల్లీ, డిసెంబర్ 26 : ప్రస్తుతం బ్రిటిష్ రాచరిక ఆభరణాలలో భాగంగా ఉన్న ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు వాపసు చేయాలంటూ లండన్‌లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. టవర్ ఆఫ్ లండన్‌లోని జువెల్ హౌస్‌లో బహిరంగ ప్రదర్శనకు ఉంచిన కోహినూర్ అందాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న కోహినూర్ వజ్రం అనేకమంది రాజులకు, పాదుషాలకు శాపంగా పరిణమించింది. ఉజ్వలంగా కాంతులీనుతూ అతి సుందరంగా కనిపించే కోహినూర్ వజ్రం పురుష యజమానులకు మిగిల్చిన శోకం మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు.
105.6 క్యారెట్ల బరువు ఉండే కోహినూర్ పుట్టుపూర్వోత్తరాల్లోకి వెళితే.. 13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యంలో ఇప్పుడు తెలంగాణలోని గోల్కొండ ప్రాంతంలో ఉన్న కొల్లూరు గనులలో కోహినూర్ వజ్రం మొదట బయటపడింది. ఎందరో రాజులు, రాజ్యాల చేతులు మారిన ఈ అపురూపమైన వజ్రం భీకర యుద్ధాలకు దారితీసింది. దీన్ని పొందేందుకు హింస, విద్రోహం, చిత్రహింసలు, హత్యలు వంటివి శతాబ్దాల తరబడి సాగాయి. భూమి, వనరులు, సిరిసంపదలు, పరువు ప్రతిష్ట, మహిళలు, గుర్తింపు, మతం కోసం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినప్పటికీ ఓ వజ్రం కోసం జరిగిన యుద్ధాలు దాన్ని సొంతం చేసుకున్న పురుష యజమానులకు దురదృష్టాన్ని మిగిల్చాయి.
1290 దశకంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ రాజ్యాన్ని హస్తగతం చేసుకునేందుకు తన మేనమామ సుల్తాన్ జలాలుద్దీన్ని హతమార్చాడు. అనంతరం దక్షిణ భారతదేశంలో తన సైన్యంతో కలసి ప్రయాణం సాగిస్తుండగా అమూల్యమైన కోహినూర్ వజ్రం ఖిల్జీ సొంతమైంది. ఆ తర్వాత ఈ వజ్రం మొఘల్ చక్రవర్తి షాజహాన్ కూర్చునే నెమలి సింహాసనంలో భాగంగా మారింది. తన కుమారుడు ఔరంగజేబు చేతిలో విద్రోహానికి గురైన షాజహాన్ తన చివరి రోజులు ఆగ్రా కోటలో బందీగా ఉండాల్సి వచ్చింది. 1739లో ఇరాన్‌కు చెందిన అఫ్షరీద్ సామ్రాజ్య వ్యవస్థాసకుడు నాదిర్ షా మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షాకు తలపాగాలు ఇచ్చి అందుకు బదులుగా కోహినూర్ వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఢిల్లీలో 9 గంటలపాటు జరిగిన పోరులో దాదాపు 30,000 మంది సైనికులు ఊచకోతకు గురైనట్లు మొఘల్ రాజుకు సమాచారం చేరడంతోనే ఈ వజ్రం చేతులు మారినట్లు చరిత్రకారులు చెబుతారు. 1747లో హత్యకు గురయ్యేంత వరకు కోహినూర్ నాదిర్ షా వద్దనే ఉంది. అనంతరం ఆ వజ్రం అతని మనవడు షారోఖ్ షా చేతిలోకి వచ్చింది. 1796లో అఘా మహ్మద్ ఖాన్ ఖజర్ చేతుల్లో షారోఖ్ షా మరణించాడు. ఆ తర్వాత ఈ వజ్రం షా షుజా దురానీ చేతిలోకి వెళ్లింది. ఈ వజ్రాన్ని తన బ్రేస్లెట్లో ధరించిన దురానీ తన రక్షణ కోసం దీన్ని మహారాజా రంజిత్ సింగ్‌కు అప్పగించాల్సి వచ్చింది. 1839లో మహారాజా రంజిత్ సింగ్ మరణించిన అనంతరం అతని పెద్ద కుమారుడు ఖరాక్ సింగ్‌కు వజ్రం వెళ్లింది. కారాగారంలో విషప్రయోగంతో అతను మరణించిన తర్వాత అతని మనవడు నావ్ నిహాల్ సింగ్ అనుమానాస్పద రీతిలో మరణించాడు. ఆ తర్వాత సిక్కు సామ్రాజ్యం చివరి రాజు దులీప్ సింగ్ వద్దకు ఈ వజ్రం చేరుకుంది. అప్పటికి అతనికి 10 ఏండ్ల వయసు మాత్రమే.
1849లో సిక్కు సామ్రాజ్యాన్ని బ్రిటిష్ రాజ్ విలీనం చేసుకుంది. చివరి లాహోర్ ఒప్పందంపై మహారాజా దులీప్ సింగ్, బ్రిటిష్ ప్రతినిధులు సంతకాలు చేయగా బ్రిటిష్ రాణి విక్టోరియాకు కోహినూర్ బహుమతిగా వెళ్లింది. 1857 తిరుగుబాటు ఈస్ట్ ఇండియా కంపెనీని దిగ్భ్రాంతికి గురిచేయగా కోహినూర్ తెచ్చే దురదృష్టాన్ని గుర్తించిన బ్రిటిషర్లు దీన్ని రాజులెవరూ ధరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కోహినూర్ వజ్రం పొదిగిన కిరీటాన్ని క్వీన్ విక్టోరియా, క్వీన్ అలెగ్జాండ్ర, క్వీన్ మదర్ ఎలిజబెత్ యాంజెలా మార్గెరిట్, క్వీన్ ఎలిజబెత్ 2 తదితర మహారాణులు మాత్రమే అమూల్యమైన ఈ వజ్రాన్ని ధరించారు.