న్యూఢిల్లీ, నవంబర్ 27: అదానీ వ్యవహారం రెండో రోజు పార్లమెంటును కుదిపేసింది. అమెరికాలో అదానీ సంస్థపై నమోదైన కేసు, ఈ సంస్థపై వచ్చిన ఆరోపణలపై చర్చకు ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగిన హింసపైనా చర్చించాలని డిమాండ్ చేశారు. దీంతో ఉభయసభలు గురువారానికి వాయిదా పడ్డాయి. బుధవారం లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా.. ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. దీంతో ప్రతిపక్షాల సభ్యులు అదానీ, సంభాల్ హింసపై చర్చించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సభను 12 గంటలకు వాయిదా వేశారు. సభ ప్రారంభమయ్యాక కూడా నినాదాలు కొనసాగడంతో సభ గురువారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో సభను ఒక రోజు వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ జగ్దీప్ ధన్కర్ ప్రకటించారు.