India Pakistan Tension | న్యూఢిల్లీ: ఉగ్రవాదులు, వారికి మద్దతు పలికే వారికి భారత్ శనివారం గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇకపై ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. అందుకు తగిన విధంగా స్పందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఈ నెల 7న పీవోకేలోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. నాలుగైదు రోజుల నుంచి భారత్-పాక్ మధ్య సైనిక ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఈ తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. అంతర్జాతీయ చట్టం ప్రకారం ‘యుద్ధ చర్య’ అంటే ఒక దేశం(రాజ్యం) మరొక దేశం లేదా రాజ్యంపై తీసుకొనే చర్య. ఇది సాధారణంగా సాయుధ ఘర్షణ లేదా యుద్ధానికి సంకేతం. ఐరాస చార్టర్లోని అధికరణ 2(4) ప్రకారం ఐరాస సభ్య దేశాలు ఆత్మ రక్షణ సందర్భాలు లేదా యూఎన్ భద్రతా మండలి అధికారం ఇచ్చినప్పుడు తప్ప ఏదైనా రాజ్యం లేదా దేశం రాజకీయ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా బల ప్రయోగం చేయడాన్ని నిషేధిస్తుంది. చారిత్రకంగా ఒక రాజ్యం (దేశం) సాయుధ బలగాలతో తీసుకొనే చర్యలను సమర్థించుకోవడంగా నిర్వచిస్తారు.