న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్థాన్ దాడులకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తున్నది. శనివారం భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన యుద్ధ విమానాలు పాకిస్థాన్‌లోని 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. రాడార్ యూనిట్లు, మందుగుండు సామగ్రి డంప్‌లను ఎయిర్ లాంచ్డ్ ప్రెసిషన్ ఆయుధాలతో నాశనం చేశాయి. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో భారత్ చేపడుతున్న సైనిక దాడుల గురించి రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు మీడియాకు వివరించారు.
కాగా, పాకిస్థాన్ దాడులకు ప్రతిస్పందనగా ఆ దేశంలోని రఫీకి, మురిద్, చక్లాలా, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియన్, పస్రూర్, సియాల్కోట్లోని సైనిక లక్ష్యాలను ఐఏఎఫ్ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు.
మరోవైపు శనివారం భారత్ చేపట్టిన వైమానిక దాడుల్లో పాకిస్థాన్‌లోని సాంకేతిక మౌలిక సదుపాయాలు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వ ప్రాంతాలు ధ్వంసమయ్యాయని కల్నల్ సోఫియా ఖురేషి చెప్పారు. భారత దళాలు గుర్తించిన పాకిస్థాన్‌కు చెందిన సైనిక లక్ష్యాలపై మాత్రమే ఖచ్చితమైన దాడులు చేపట్టినట్లు వివరించారు.