Budget 2026 : హిందువులు సహా మైనారిటీలపై దాడుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బంగ్లాదేశ్‌కు ఇండియా షాకిచ్చింది. ఆ దేశానికి ప్రతి ఏటా అందిస్తున్న ఆర్థిక సాయాన్ని సగానికి తగ్గించింది. ఈ మేరకు ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026-27లో బంగ్లాకు అందించబోయే నిధుల్ని సగం తగ్గించింది. బంగ్లా ఆర్థిక పరిస్థితి ధీనంగా ఉండటంతో ఆ దేశానికి భారత్ సాయం చేస్తూ వస్తోంది.
ప్రతి ఏటా కోట్ల రూపాయల నిధుల్ని మన బడ్జెట్లోనే కేటాయిస్తాం. అయితే, ఈసారి మాత్రం గత ఏడాది ఇచ్చిన నిధుల్లో సగం మాత్రమే కేటాయిస్తూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది బంగ్లాకు రూ.120 కోట్ల సాయం అందించగా.. ఈసారి 50 శాతం తగ్గించి రూ.60 కోట్లు మాత్రమే కేటాయించారు. గత ఏడాది చివరి నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. హిందువులపై దాడులు చేయడం, వారి ఆస్తుల్ని ధ్వంసం చేయడంతోపాటు కొందరిని హత్య చేశారు. ఈ అంశంలో భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ దాడుల్ని ఆపాలని బంగ్లాలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడం లేదు. ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య నెమ్మదిగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటున్నాయి. మరోవైపు వచ్చే వారం మన దేశంలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు బంగ్లా నిరాకరించింది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు షాకిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బంగ్లాకు అందించే సాయాన్ని తగ్గించింది. మరోవైపు ఇరాన్ పరిధిలోని చాబహార్ పోర్టుకు కూడా ఈసారి కేంద్రం నిధులు కేటాయించలేదు. ఇరాన్ వాణిజ్యానికి, భారత ఎగుమతులకు ఈ పోర్టు కీలకం. ఈ పోర్టు అభివృద్ధిలో భారత్ కీలక భాగస్వామిగా ఉంది. బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ వస్తోంది. కానీ, ఈసారి మాత్రం నిధులు కేటాయించలేదు. కారణం.. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడమే.