న్యూఢిల్లీ, మే 31: సింధూ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్ భారత్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ నిందించడం మానుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ డిమాండ్ చేశారు. తజికిస్థాన్‌లోని దుషంబేలో హిమానీ నదాలపై ఐక్య రాజ్య సమితి శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ సింధూ జలాలపై పాక్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి, రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై అనేక దౌత్యపరమైన చర్యలు చేపట్టిన భారత ప్రభుత్వం సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది.
ఈ వేదికపై అసందర్భ అంశాలను పాక్ ప్రస్తావించడం తగదని ఆయన చెప్పారు. కాలంతోపాటే ఒప్పందం సారాంశం కూడా మారిపోయిందని ఆయన తెలిపారు. వాతావరణ మార్పులు, జనాభా ఒత్తిళ్లు, సీమాంతర ఉగ్రవాదం వంటి కొత్త పరిణామాలుగా ఆయన ఉదహరించారు. ఒప్పంద నిబంధనలు మళ్లీ అంచనా వేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. పరస్పర సహకారం, గౌరవం స్ఫూర్తిగా ఒప్పందం అమలు జరగాల్సి ఉందని, కాని పాకిస్థాన్ వైపు నుంచి తరచూ జరుగుతున్న సీమాంతర ఉగ్రవాదం ఈ ఒప్పం దం స్ఫూర్తినే దెబ్బతీస్తోందని సింగ్ అన్నారు. ఒప్పందాన్ని తానే ఉల్లంఘిస్తూ పాక్ భారత్‌పై నింద వేస్తోందని ఆయన విమర్శించారు.