Asaduddin Owaisi : అమెరికా వేదికగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ (Pak Army chief) ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ (Asim Munir) భారత్‌పై అణు బెదిరింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలను తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రంగా ఖండించారు. కేవలం విదేశాంగ శాఖ ప్రకటనతో సరిపెట్టకుండా ఈ అంశాన్ని మోదీ ప్రభుత్వం బలంగా ప్రస్తావించాలని డిమాండ్ చేశారు.
‘ఎక్స్’ వేదికగా ఒవైసీ స్పందిస్తూ.. భారత్‌ను ఉద్దేశించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఉపయోగించిన భాష, ఆయన చేసిన బెదిరింపులు తీవ్రంగా ఖండించదగినవని అన్నారు. అమెరికా గడ్డపై నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరింత దారుణమని, దీనిపై మోదీ ప్రభుత్వం కేవలం విదేశాంగ శాఖ ప్రకటనతో సరిపెట్టకుండా రాజకీయంగా స్పందించాలని సూచించారు. అమెరికా ప్రభుత్వానికి గట్టిగా నిరసన తెలపాలని చెప్పారు.
అమెరికా మనకు వ్యూహాత్మక భాగస్వామి అని, అలాంటి దేశాన్ని భారత్‌కు వ్యతిరేకంగా వాడుకోవడాన్ని అంగీకరించలేమని ఒవైసీ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ సైనిక కుట్రల నేపథ్యంలో భారత సైన్యాన్ని మరింత ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని, మోదీ ప్రభుత్వం రక్షణ రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ సరిపోదని విమర్శించారు.
గత శనివారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోగల టాంపా నగరంలో పాకిస్థానీ ప్రవాసులతో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ డిన్నర్లో అసిమ్ మునీర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఒక అణుశక్తి దేశమని, మేం పతనమవుతున్నామని భావిస్తే మాతో పాటు సగం ప్రపంచాన్ని ముంచేస్తామని ఆయన హెచ్చరించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.