న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలకు ఐదేండ్ల వయసు రాకముందే నూరేళ్లు నిండుతున్నాయి. పిల్లల అకాల మరణాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఐదేండ్లలోపు పిల్లల మరణాల్లో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉన్నది.
2023లో ప్రపంచ వ్యాప్తంగా ఐదేండ్లు నిండక ముందే దాదాపు పది లక్షల మంది పిల్లలు మరణించారు. బరువు తక్కువగా ఉండటం, ఎదుగుదల లేకపోవడం, క్షీణించడం వంటి కారణాల వల్ల వీరు మరణించారు. ఇలాంటి మరణాలు భారత్లో లక్ష కంటే ఎక్కువే సంభవించాయని ఒక కొత్త అధ్యయనం తెలిపింది. పిల్లల పెరుగుదల వైఫల్యం కారణంతో నైజీరియా దేశంలో అత్యధికంగా 1,88,000 మంది మరణించారు.