న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం 49 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 34 వేలకు దిగివచ్చాయి. నిన్నటికంటే ఇవి 24 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారినపడుతున్నవారి సంఖ్య తగ్గుతూ వస్తుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు కూడా తగ్గింది.
దేశంలో కొత్తగా 34,113 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,26,65,534కు చేరాయి. ఇందులో 5,09,011 మంది మరణించగా, 4,78,882 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 4,16,77,641 మంది కరోనా నుంచి బయటపడ్డారు. కాగా, గత 24 గంటల్లో మరో 346 మంది మృతిచెందగా, 91,930 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా కేసులు తగ్గిననేపథ్యంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతానికి పడిపోయిందని తెలిపింది. అదేవిధంగా యాక్టివ్ కేసులు 1.12 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు 1,72,95,87,490 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.