న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా నలుమూలా వ్యాప్తి చెందుతుండటంతో మహమ్మారి బారినపడుతున్న వారిసంఖ్య పెరుగుతున్నది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ పోతున్నది.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 27,553 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 3,48,89,132కు చేరాయి. ఇందులో 4,81,770 మంది మరణించారు. 3,42,84,561 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా, 1,22,801 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో యాక్టివ్ కేసులు ఆరు నెలల గరిష్ఠానికి చేరాయి. కాగా, శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు మరో 284 మంది మరణించగా, 9,249 మంది కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.35 శాతం కేలసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.27 శాతం, మరణాల రేటు 1.38 శాతంగా ఉందని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,45,44,13,005 కరోనా డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇందులో శనివారం ఒక్కరోజే 25,75,225 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని వెల్లడించింది.
ఇక కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం సృష్టిస్తున్నది. కొత్తగా 94 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసులు 1525కి చేరాయి. ఇందులో మహారాష్ట్ర, ఢిల్లీలోనే సగానికిపైగా ఉన్నాయి. అత్యధికంగా 460 కేసులు మహారాష్ట్రలో నమోదవగా, ఢిల్లీలో 351, గుజరాత్లో 136, తమిళనాడులో 117, కేరళ 109, రాజస్థాన్ 69, తమిళనాడు 67, కర్ణాటకలో 64, హర్యానాలో 63 చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకు 560 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు.