న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు వరుసగా రెండో రోజూ తగ్గాయి. సోమవారం 3 లక్షలకు పైగా కేసులు నమోదవగా, తాజాగా 2.5 లక్షలకు తగ్గాయి. ఇది నిన్నటికంటే 50 వేలు తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఐదురోజుల తర్వాత కరోనా రోజువారీ కేసులు 3 లక్షల దిగువకు చేరాయని తెలిపింది. అదేవిధంగా పాజిటివిటీ రేటు కూడా పడిపోయిందని చెప్పింది.
దేశవ్యాప్తంగా కొత్తగా 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,97,99,202కు చేరాయి. ఇందులో 22,36,842 కేసులు యాక్టివ్గా ఉండగా, 4,90,462 మంది మరణించారు. మరో 3,70,71,898 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, సోమవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 614 మంది మృతిచెంగా, 2,67,753 వైరస్ నుంచి బయటపడ్డారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 28,286 కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. కర్ణాటకలో 46,426, తమిళనాడులో 30,215, కేరళలో 26,514, ఆంధ్రప్రదేశ్లో 14,502 కేసుల చొప్పున నమోదయ్యాయి.