న్యూఢిల్లీ: దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తగ్గాయి. శుక్రవారం 1.49 లక్షల కేసులు నమోదవగా, తాజాగా 1.27 లక్షల మంది కరోనా బారినపడ్డారు. ఇవి నిన్నటికంటే 9.2 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ కేసులు తగ్గడంతో పాజిటివిటీ రేటు కూడా పడిపోయింది.
దేశంలో కొత్తగా 1,27,952 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,20,80,664కు చేరాయి. ఇందులో 13,31,648 కేసులు యాక్టివ్గా ఉండగా, 5,01,114 మంది బాధితులు మృతిచెందారు. ఇప్పటివరకు 4,02,47,902 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక కొత్తగా 1059 మంది మరణించగా, 2,30,814 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.
ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,68,98,17,199 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.