శ్రీనగర్: నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి కృష్ణ ఘాటి సెక్టార్లో పొంచి ఉండి భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్థాన్ విఫలయత్నం చేసింది. భారత్ సైనిక స్థావరంపై దాడి చేసేందుకు పాకిస్థానీలు చేసిన ప్రయత్నాన్ని భారత్ సైన్యం తిప్పికొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు పాక్ చొరబాటుదారులు మరణించారు. వీరిలో ఇద్దరు లేదా ముగ్గురు పాక్ సైనికులని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మిగిలినవారు అల్ బద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారై ఉండవచ్చునని తెలుస్తున్నది. ఈ ఘటన జమ్ము కశ్మీరులోని పూంఛ్ జిల్లాలో ఈ నెల 4-5 తేదీల మధ్య రాత్రి జరిగింది. భారత వ్యతిరేక ఎజెండాతో పాకిస్థాన్ ఏటా కశ్మీరు సంఘీభావ దినాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా ఈ దాడికి పాల్పడిందని ఆర్మీ అధికారులు తెలిపారు.
ఇటీవల కాలంలో జమ్ముకశ్మీర్‌పై ఉగ్రదాడులకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇలా దాడులకు పాల్పడే ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో స్వయంగా పాకిస్థాన్ ఆర్మీయే శిక్షణ ఇస్తున్న చిత్రాలు ఇటీవల వెలుగుచూశాయి. పీఓకేలోని కొట్లి ప్రాంతంలో కొంతమందికి శిక్షణ ఇస్తున్నారు. కిరాయి సైనికులతో ఉండే ఒక్కో గ్రూప్‌కు కనీసం రూ.1 లక్ష చెల్లిస్తున్నదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీరికి అత్యాధునికమైన ఖరీదైన ఆయధాలు, ఎం4 రైఫిల్స్, చైనా ఆయుధ సంపత్తి, బుల్లెట్లు అందజేస్తున్నది.