న్యూఢిల్లీ, డిసెంబర్ 31: పహల్గాం ఘటన అనంతరం భారత్, పాక్ మధ్య చోటుచేసుకున్న సాయుధ ఘర్షణ తన వల్లనే సద్దుమణిగిందని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకోగా.. తాజాగా చైనా కూడా తయారైంది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలను తొలగించడానికి తమ దేశం మధ్యవర్తిత్వం వహించిందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించలేదు, ఖండించనూ లేదు.
చైనా మంత్రి ప్రకటనను భారత విదేశాంగ శాఖ తిరస్కరించింది. భారత్, పాక్ మధ్య మూడోపక్షం ఏదీ జోక్యం చేసుకోలేదని పేర్కొంది. చైనా మంత్రి ప్రకటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ భద్రత ఒక ‘జోక్’ అయిపోయిందని వ్యాఖ్యానించారు. భారత్, పాక్ మధ్య చైనా మధ్యవర్తిత్వం వహించానని చెప్పడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఇది దేశ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నదని అన్నారు.