న్యూఢిల్లీ: పాకిస్థాన్ దుస్సాహసానికి పాల్పడితే ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆర్మీ తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో ‘ఆపరేషన్ సిందూర్’తో (Operation Sindoor) పాక్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు చెప్పింది. దీనిపై పాకిస్థాన్ ఎలా స్పందిస్తుందనే దానిపై తదుపరి సైనిక చర్యలు ఆధారపడి ఉంటాయని మిలిటరీ అధికారులు తెలిపారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత్ ఏ మాత్రం వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు.
కాగా, భారత్ ఉద్రిక్తతలను పెంచబోదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తెలిపారు. అయితే పాకిస్థాన్‌పై దృఢంగా ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’పై ఆయన ఈ మేరకు స్పందించారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్’తో పీవోకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు, శిక్షణా కేంద్రాలను భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ఈ దాడిలో సుమారు వంద మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తున్నది. భారత వైమానిక దళంతో పాటు, నేవీ, ఆర్మీ కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.