India in Gender Equality | ఆకాశంలో సగం అని మహిళలను కీర్తిస్తాం.. కానీ లింగ సమానత్వంలో భారత్ ఇంకా వెనుకబడే ఉంది. గతంతో పోలిస్తే ఐదు స్థానాలు మెరుగు పడినా ఓవరాల్‌గా భారత్ ప్రమాణాలకు దిగువనే ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) జారీ చేసిన వార్షిక లింగ వ్యత్యాసం నివేదిక-2022లో పేర్కొంది. లింగ సమానత్వం పాటిస్తున్న అన్ని ప్రమాణాలకు పెద్ద పీట వేస్తున్న దేశంగా ఐస్లాండ్ మళ్లీ మొదటి స్థానాన్ని కాపాడుకున్నది. తర్వాతీ స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ నిలిచాయి.
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) మొత్తం 146 దేశాల్లో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం పట్ల పాటిస్తున్న ప్రమాణాల ప్రాతిపదికన ఇండెక్స్ తయారు చేసింది. కానీ, భారత్ కంటే దిగువన కేవలం 11 దేశాలే ఉన్నాయి. వాటిల్లో తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్, దానిపక్కనే ఉన్న పాకిస్థాన్, కాంగో, ఇరాన్, చాద్ దేశాల్లో మహిళల పరిస్థితి దారుణంగా మారింది.
జీవన వ్యయ సంక్షోభం వల్ల కూడా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గంలో లింగ వివక్ష మరింత పెరుగుతున్నదని డబ్ల్యూఈఎఫ్ హెచ్చరించింది. 2021లో భారత్ 136వ స్థానంలో ఉంటే, ఈ ఏడాది 132వ ర్యాంక్‌కు చేరుకుంది. కొవిడ్ మహమ్మారి కూడా లింగ సమానత్వం దెబ్బ తినడానికి ఒక కారణం. అంతే కాదు లింగ సమానత్వం ఒక జనరేషన్ వెనుకబడిందని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది.
భారత్‌లో లింగ వ్యత్యాసం స్కోర్‌లో గత 16 ఏండ్లలో ఏడో అత్యంత స్థాయికి చేరుకున్నా, వివిధ ప్రమాణాల రీత్యా భారత్‌లో పరిస్థితి దారుణంగా ఉందని తెలిపింది. 2021 నుంచి కోలుకున్నా పని ప్రదేశాల్లో స్త్రీ, పురుషుల భాగస్వామ్యం దెబ్బ తిన్నదని పేర్కొంది. మహిళా ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారులు, మేనేజర్ల స్థాయిలో మహిళల ప్రాతినిధ్యం 14.6 నుంచి 17.6 శాతానికి పెరిగింది. ప్రొఫెషనల్, టెక్నికల్ వర్కర్స్ విభాగంలో భారత్‌లో పరిస్థితి 29.2 నుంచి 32.9 శాతానికి దూసుకెళ్లింది. కానీ రాజకీయ సాధికారత రంగంలో భారత్ 48వ స్థానంలో కొనసాగుతున్నది. కానీ, 50 ఏండ్ల రికార్డులు పరిశీలిస్తే క్రమంగా మహిళల ప్రాతినిధ్యం తగ్గుతున్నది.