Illegal Migrants | అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా యూఎస్‌లో నివసిస్తున్న వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులపై (Illegal Migrants) కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై అధిక పన్ను విధిస్తున్నారు. తద్వారా వలసలను తగ్గించొచ్చని అధ్యక్షుడు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ చర్యలతో భారత్ ఆచుతూచి నిర్ణయాలు తీసుకుంటోంది. అగ్రరాజ్యంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న దౌత్య, ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. వాటిపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతోంది. ట్రంప్ పాలనకు సహకరించేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న తమ పౌరులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ యోచిస్తున్నట్లు సమాచారం.
సరైన పత్రాలు లేకుండా దాదాపు 18,000 మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. అయితే, వాస్తవానికి ఆ సంఖ్య మరింత ఎక్కువ కూడా ఉండొచ్చని అంచనా. తాజాగా కొత్త అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో వాళ్లందరినీ వెనక్కి పిలిపించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. దీనికోసం ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించబోతోందని పేర్కొన్నారు.
కాగా, ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసదారులపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులను ర్యాడికల్స్, టెర్రరిస్టులుగా అభివర్ణించారు. అలాంటి వాళ్లు అమెరికా గడ్డపై నివసించేందుకు ఏమాత్రం అర్హులు కాదని వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వలసలపై ఉక్కుపాదం మోపుతానని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆచరణలో పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే జన్మతః పౌరసత్వ హక్కును కూడా రద్దు చేశారు.
అమెరికా పౌరులకు పుట్టిన వారికే కాకుండా.. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి ఈ జన్మతః పౌరసత్వ విధానం కొనసాగుతున్నది. అయితే, దీన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ‘అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చిన వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదు’ అని ట్రంప్ ప్రకటించారు.ఈ నిర్ణయంతో లక్షలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపించనున్నట్టు నిపుణులు చెప్తున్నారు. ఇక ట్రంప్ చర్యల నేపథ్యంలో అప్రమత్తమైన భారత ప్రభుత్వం భారతీయులను తిరిగి వెనక్కి రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
Also Read..
Birthright Citizenship: జన్మతః పౌరసత్వం రద్దుపై భారత సంతతి చట్టసభ ప్రతినిధుల ఆందోళన
Donald Trump: చైనా దిగుమతులపై 10 శాతం పన్ను విధించనున్న అమెరికా
ఉషా చిలుకూరిపై ట్రంప్ ప్రశంసలు