UDISE : దేశంలో 1.02 కోట్ల మంది టీచర్లు, 14.66 లక్షల స్కూళ్లు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు దేశంలోని స్కూళ్లకు సంబంధించి యూడీఐఎస్ఈ+ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్) 2025-26 రిపోర్టును కేంద్ర విద్యాశాఖ తాజాగా వెల్లడించింది. దేశంలోని స్కూల్స్, టీచర్లు, విద్యార్థుల సంఖ్య, డ్రాపౌట్లు వంటి అంశాల్ని ఈ నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. 2025-26 విద్యా సంవత్సరంలో 1.02 కోట్ల (1,02,73,020) మంది టీచర్లున్నారు.
అలాగే 14.66 లక్షల స్కూళ్లు (14,66,682) పనిచేస్తుండగా, 24.72 కోట్ల (24,72,19,766) మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత విద్యా సంవత్సరంలో డ్రాపౌట్ శాతం తగ్గి, 1.8గా ఉంది. 2024-25 విద్యా సంవత్సరంలో స్కూళ్లలో విద్యార్థుల డ్రాపౌట్ శాతం 2.3 శాతంగా ఉండేది. మరోవైపు టీచర్ల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. 2022-23లో 94.8 లక్షల మంది టీచర్లు పనిచేయగా, 2024-25లో 1.01 కోట్ల మంది టీచర్లు స్కూళ్లలో పని చేశారు. ఉపాధ్యాయుల సంఖ్య కోటి దాటడాన్ని దేశ పాఠశాలల చరిత్రలో గొప్ప విజయంగా కేంద్ర విద్యాశాఖ అభివర్ణించింది. కేంద్రం అమలు చేస్తున్న సమగ్ర శిక్ష, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ద్వారా ఇది సాధ్యమైందని తెలిపింది. మరోవైపు పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్స్ సంఖ్య కూడా తగ్గినట్లు వివరించింది.
పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగినప్పటికీ.. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం మాత్రం తగ్గింది. 2024-25లో ప్రభుత్వ పాఠశాలల్లో 12.1 కోట్ల మంది నమోదు చేసుకోగా, 2025-26లో 11.8 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల నమోదు సంఖ్య దాదాపు 30 లక్షలు పెరిగింది. దేశంలో సింగిల్ టీచర్ స్కూల్స్ 3 శాతం ఉన్నాయి. వీటిలో చాలావరకు విద్యార్థుల నమోదు శాతం సున్నాగా ఉంది. ఇలా ఒక్క విద్యార్థి లేని పాఠశాలల శాతం 2గా ఉంది.