న్యూఢిల్లీ, మే 21: భారత్‌లో ఏటా అనేక మంది శ్రామిక శక్తిలో చేరుతున్నారని, అందుకు అనుగుణంగా దేశంలో ప్రతి ఏడాది దాదాపు కోటి 65 లక్షల చొప్పున 2030 నాటికి 11.5 కోట్ల ఉద్యోగాల సృష్టి జరుగాల్సిన అవసరం ఉన్నదని తాజా అధ్యయనం పేర్కొన్నది. ఆర్థిక వ్యవస్థ విస్తరణను కొనసాగించేందుకు సేవలు, తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలని సూచించింది. ప్రతి ఏడాది 1.04 కోట్ల ఉద్యోగాల వరకు వ్యవస్థీకృత రంగంలో సృష్టించాల్సిన అవసరం ఉన్నదని నాటిక్సిస్ ఎస్ఏ సీనియర్ ఆర్థికవేత్త ట్రిన్ గుయేన్ అధ్యయన రిపోర్టులో పేర్కొన్నారు.
ఈ కఠినమైన టాస్క్‌ను సాధించాలంటే భారత వృద్ధి ఇంజిన్ రాబోవు ఐదేండ్లలో తయారీ రంగం నుంచి సేవల వరకు అన్ని సెక్టార్లలో దూసుకుపోవాలని అభిప్రాయపడ్డారు. గత పదేండ్లలో జనరేట్ అయిన ఉద్యోగాల్లో కేవలం 10 శాతం మాత్రమే వ్యవస్థీకృత రంగంలోనివని పేర్కొన్నారు. దేశంలో జనాభాకు అవసరమైన ఉద్యోగాలకు అనుగుణంగా ఆర్థిక వృద్ధి జరుగడం లేదని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో ఓవైపు నిరుద్యోగం భారీస్థాయిలో పెచ్చరిల్లిపోతున్న విషయం తెలిసిందే.