ముంబై: రాబోయే పదేళ్లలో దేశం ఆర్థికంగా స్వయం సమృద్ధి కావాలని ప్రధాని మోదీ(PM Modi) ఆకాంక్షించారు. ఎందుకంటే ప్రపంచ దేశాల ప్రభావం భారత్‌పై పడకుండా ఉంటుందన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్సికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడవ సారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికీ కావాల్సినంత పని దొరుకుతుందని అన్నారు. భారత స్వయంసమృద్ధి సత్తాను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకింగ్ రంగం లాభదాయకంగా మారిందన్నారు. గత పదేళ్లలో ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న చర్యల వల్ల క్రెడిట్ గ్రోత్ జరుగుతోందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2018లో 11.25 శాతంగా ఉన్న ఎన్పీఏలు, 2023 సెప్టెంబర్ నాటికి మూడు శాతానికి పడిపోయినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం బ్యాంకుల్లో 15 శాతం క్రెడిట్ గ్రోత్ నమోదు అవుతోందన్నారు. ఈ ప్రగతిలో ఆర్బీఐ కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోదీ ప్రశంసించారు.