Manmohan Singh – PM Modi | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో దేశం అత్యంత విశిష్ట నేతల్లో ఒకరిని కోల్పోయిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. గురువారం రాత్రి అనారోగ్యంతో బాధ పడుతూ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల యావత్ జాతి దు:ఖ సాగరంలో మునిగిపోయిందని వ్యాఖ్యానించారు. దేశ రూపురేఖలే మార్చేసిన ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ అని ‘ఎక్స్’లో ప్రధాని మోదీ పోస్ట్ పెట్టారు. ఏండ్ల తరబడి దేశ ఆర్థిక రంగంపై ఆయన బలమైన ముద్ర వేశారని పేర్కొన్నారు.
నిరాడంబర వ్యక్తి నుంచి పేరొందిన ఆర్థిక వేత్తగా ఎదిగారని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ పని చేసినప్పుడు, గుజరాత్ సీఎంగా వివిధ అంశాలపై సవివరంగా చర్చించే వారం అని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పట్ల ప్రధాని మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. భరత మాత ముద్దు బిడ్డల్లో ఒకరిగా మన్మోహన్ సింగ్కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నానని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులు, అభిమానులకు హృదయ పూర్వక సానుభూతి తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.