న్యూఢిల్లీ, ఆగస్టు 3: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో జరిగిన సైనిక ఘర్షణలో తమకు ఎదురైన నష్టంపై భారత్ ఇంతవరకు పెదవి విప్పనప్పటికీ ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఓ రాఫెల్ యుద్ధ విమానాన్ని భారత్ కోల్పోయినట్లు తాజా మీడియా కథనాలు వెల్లడించాయి. అత్యంత శక్తివంతమైన అధునాతన యుద్ధ విమానంగా పేరుగాంచిన ఫ్రెంచ్ తయారీ రాఫెల్ సామర్థ్ధ్యంపై అనుమానాలకు తావిచ్చేలా దీని చైనా ప్రత్యామ్నాయ యుద్ధ విమాన పనితీరు కల్పిస్తోంది. అయితే రాఫెల్‌తో వచ్చిన సమస్య ఏమీ లేదని, నిఘా వైఫల్యమే అసలు సమస్యని రాయిటర్స్ వార్తా సంస్థ తాజా కథనం వెల్లడించింది. చైనా తయారీ పీఎల్-15 క్షిపణి సామర్థ్యాన్ని అంచనా వేయడంలో జరిగిన వైఫల్యమే రాఫెల్ కూల్చివేతకు కారణమని రాయిటర్స్ తెలిపింది.
నిఘా వ్యవస్థ ఇచ్చిన తప్పుడు సమాచారంతో రాఫెల్ పైలట్లు అతి విశ్వాసంతో వ్యవహరించారని, పాకిస్థానీ ఫైరింగ్ రేంజ్ 150 కిలోమీటర్లకు అవతలే తాము ఉన్నామని వారు భావించారని ఓ భారతీయ అధికారిని ఉటంకిస్తూ వార్తాసంస్థ వెల్లడించింది. దాదాపు 200 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించిన పీఎల్-15 క్షిపణి రాఫెల్‌ని కూల్చివేసినట్ల్లు లండన్‌లోని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్కు చెందిన గగనతల యుద్ధ నిపుణుడు జస్టిన్ ర్రాంక్ తెలిపారు. భారత్, పాక్ ఘర్షణలో ఒక్క రాఫెల్‌ని కూడా కోల్పోలేదని విమాన తయారీ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్ చైర్మన్, సీఈఓ ఎరిక్ ట్రాపియర్ గత నెల ప్రకటించారు.
అయితే సాంకేతిక లోపం కారణంగా ఓ జెట్ విమానాన్ని భారత్ నష్టపోయిందని ఆయన ఒప్పుకున్నారు. కాగా, రాడార్ సమాచారాన్ని పొందేందుకు తమ జే-10 యుద్ధ విమానాలు భారత్‌కు అత్యంత సమీపం నుంచి ఎగరడానికి వీలుకల్పించే డాటా లింక్ 17 పేరిట ఓ కొత్త వ్యవస్థను పాకిస్థాన్ రూపొందించినట్లు పాకిస్థానీ అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ కథనం పేర్కొంది. రాఫెల్ నష్టపోయినట్లు భారత్ ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. కాగా, ఈ ఆపరేషన్‌లో తమ సైనికులు ఎవరికీ ప్రాణ నష్టం కాని గాయపడడం కాని జరగలేదని భారత్ స్పష్టం చేసింది.