Bezalel Smotrich : ఇజ్రాయెల్ (Israel) ఆర్థిక మంత్రి (Finance Minister) బెజలెల్ స్మోట్రిచ్ (Bezalel Smotrich) భారత పర్యటనకు రానున్నారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు బెజలెల్ స్మోట్రిచ్ భారత్‌లో పర్యటిస్తారని భారత విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. రెండు దేశాల మధ్య కొంత కాలం నుంచి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలనే విషయంలో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి.
ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి భారత పర్యటన సందర్భంగా భారత్-ఇజ్రాయెల్ ‘ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BIT)’ పై సంతకం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు పడనున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. పర్యటనలో భాగంగా స్మోట్రిచ్ గాంధీనగర్‌లోని భారతదేశ ప్రపంచ ఆర్థికసేవల కేంద్రాన్ని సైతం సందర్శించనున్నారు.
బెజలెల్ స్మోట్రిచ్.. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌లతో భేటీ కానున్నట్లు అధికారులు చెప్పారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం, బలమైన, స్థితిస్థాపక పెట్టుబడి వాతావరణాన్ని సృష్టించడం, ప్రపంచ పరిస్థితులు వంటి విషయాలపై ఇరువర్గాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.
పర్యటన సందర్భంగా బెజలెల్ ఢిల్లీతోపాటు ముంబై, ఇతర ప్రాంతాలను సందర్శించనున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఇజ్రాయెల్ మంత్రులు భారత్‌కు రావడం ఇది నాలుగోసారి. ఇజ్రాయెల్ పర్యాటక మంత్రి హైమ్ కాట్జ్, పరిశ్రమల మంత్రి నిర్ బర్కత్, వ్యవసాయం, ఆహార భద్రతా మంత్రి అవి డిచ్టర్ ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌ను సందర్శించారు.