PM Modi : భారత దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్తు పూర్తయిన సందర్భంగా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ చేపట్టారు. శుక్ర, శనివారాల్లో ఈ చర్చ కొనసాగింది. శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ చర్చకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన భారతదేశ గతమెంతో ఘనమైనదని చెప్పారు. 75 ఏళ్ల రాజ్యాంగ యాత్ర ఓ గొప్ప ప్రయాణమని అన్నారు.
మన రాజ్యాంగ నిర్మాతల దీర్ఘకాలిక దృక్పథం, సహకారంతో మనం ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఇది సంబురాలు జరుపుకోవాల్సిన క్షణమని ప్రధాని చెప్పారు. ఈ రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. రాజ్యాంగ రూపకల్పన చేసిన రాజ్యాంగ నిర్మాతలతోపాటు దేశంలోని లక్షలాది మంది పౌరులకు తాను గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నానని అన్నారు.
1950లోనే భారతదేశం ప్రజాస్వామ్యం దేశం అవుతుందని నమ్మలేదని ప్రధాని వ్యాఖ్యానించారు. భారతదేశ ప్రజాస్వామ్యం, భారతదేశ గణతంత్రం గతం చాలా గొప్పదని ఆయన కొనియాడారు. దేశ ప్రజాస్వామ్యం ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. అందుకే భారతదేశాన్ని ఇప్పుడు ప్రజాస్వామ్య మాతగా పిలుస్తున్నారని చెప్పారు. మనది భారీ ప్రజాస్వామ్యం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యానికి తల్లి కూడా అని ప్రధాని మోదీ అన్నారు.