Mahmood Madani | భారతదేశానికి సంబంధించి జమాతే హింద్ చీఫ్ మహమూద్ మదానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశం మోదీ, భగవత్లది ఎంతో.. తమకు కూడా అంతే అని చెప్పారు. ఈ భూమి ముస్లింల మాతృభూమి అని చెప్పిన ఆయన.. ఇస్లాం బయటి ప్రాంతం నుంచి భారత్ వచ్చిందని చెప్పడం పూర్తిగా తప్పన్నారు. ఇస్లాం మతం అన్నింటి కన్నా అతిపురాతన మతమని చెప్పారు. తమకు సనాతన ధర్మంపై ఎలాంటి సమస్య లేదన్నారు. ఇదే సమయంలో ఇస్లాం గురించి ఫిర్యాదు చేయవద్దని హిందూ మత నాయకులకు సూచించారు. శనివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జమాతే హింద్ 34వ సెషన్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
‘బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో తమకు మతపరమైన విభేదాలు లేవు. కేవలం సైద్ధాంతిక విభేదాలు మాత్రమే ఉన్నాయి. ఆర్ఎస్ఎస్, దాని అధినేతను ఆహ్వానిస్తున్నాం. రండి. పరస్పర వివక్ష, శత్రుత్వం మరచి ఒకరినొకరం ఆలింగనం చేసుకుందాం. మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా మార్చేందుకు సాయపడదాం. సనాతన ధర్మంపై మాకు ఎలాంటి ఫిర్యాదు లేదు. ఇస్లాం ధర్మంపై కూడా మీకు ఎలాంటి ఫిర్యాదు ఉండకూడదు’ అని మహమూద్ మదానీ స్పష్టం చేశారు.
హిందువులు, ముస్లింలు సమానమే. మనుషుల మధ్య భేదం లేదు. భారతదేశంలోని పౌరులందరూ సమానమే. వారి మధ్య ఎలాంటి వివక్ష ఉండకూడదనేది తమ జమాయతే హింద్ విధానమని మహమూద్ మదానీ చెప్పారు. భారతదేశం ముస్లింలకు ఉత్తమమైన దేశమే కానీ, ఇక్కడ ముస్లింలపై ద్వేషం, రెచ్చగొట్టే కేసులు పెరుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ఇస్లామోఫోబియా విపరీతంగా పెరిగిపోయిందని విమర్శించారు. ఇలాఉండగా, శనివారం నాటి సమావేశానికి హాజరైన మతపెద్దలు.. ఇస్లామోఫోబియా, యూనిఫాం సివిల్ కోడ్, వ్యక్తిగత చట్టంలో జోక్యం, వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు, మదర్సాల సర్వే, ఇస్లాం-కశ్మీర్‌కు వ్యతిరేకంగా తప్పుడు సమాచారంపై తీర్మానాలను ఆమోదించారు.