Operation Sindoor | న్యూఢిల్లీ, మే 8: పహల్గాం ఉగ్రదాడిని గురువారం ఖండించిన యూరోపియన్ యూనియన్.. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు భారత్‌కు ఉన్న హక్కును సమర్థించింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో ఈయూ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. పహల్గాం దాడికి పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాల్సిందేనని ఈయూ స్పష్టం చేసింది. ‘ఉగ్రవాదం ఎప్పటికీ సమర్థనీయం కాదు. దాడికి బాధ్యులైన వారిని న్యాయపరంగా శిక్షించాలి. ఉగ్ర చర్యల నుంచి తమ పౌరులను రక్షించుకునే హక్కు ప్రతి రాజ్యం బాధ్యతతోపాటు హక్కు’ అని ఈయూ తన ప్రకటనలో తెలిపింది.
రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ పరిస్థితిని తాము నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. ఉభయ పక్షాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి సయంమనం పాటించాలని, రెండు వైపులా పౌరుల ప్రాణాలను పరిరక్షించుకునేందుకు దాడులు కొనసాగించరాదని ఈయూ విజ్ఞప్తి చేసింది. భారత్, పాక్ చర్చలు చేపట్టాలని కోరిన ఈయూ అంతర్జాతీయ చట్ట నిబంధనలకు లోబడి రెండు దేశాలు తమ పౌరుల జీవితాలను కాపాడేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కోరింది.
ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని భారత్, పాకిస్థాన్‌లను చైనా కోరింది. శాంతి, స్థిరత్వంలోని విస్త్రత ప్రయోజనాలకు అనుగుణంగా ఇరు దేశాలు వ్యవహరించాలని, రెండు దేశాలు సంయమనం పాటించాలని చైనా సూచించింది. గురువారం బీజింగ్‌లో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత పరిణామాలపై చైనా ఆందోళనగా ఉన్నట్టు తెలిపారు. ఐక్యరాజ్యసమితి నిబంధనలు సహా, అంతర్జాతీయ చట్టాల్ని పాటించాలని, పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే చర్యలకు ఇరు దేశాలు దూరంగా ఉండాలని.. రెండు దేశాలను తాము కోరుతున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించటంలో అంతర్జాతీయ సమాజంతో కలిసి నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి చైనా సిద్ధంగా ఉందని అన్నారు.
లండన్ : పహల్గాం ఉగ్ర దాడిని బ్రిటన్ పార్లమెంటు సభ్యురాలు ప్రీతీ పటేల్ ఖండించారు. ఉగ్రవాద నిరోధక చర్యలను భారత్‌తో కలిసి పటిష్టపరచాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు. పాకిస్థాన్ నుంచి పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలు సృష్టిస్తున్న సీమాంతర ముప్పును గుర్తించాలని బ్రిటన్ను కోరారు. యూకే హౌస్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడుతూ ఆమె ఈ పిలుపునిచ్చారు. భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు సడలిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సైనికపరమైన ఉద్రిక్తతలను నివారించాలన్నారు. భారత్‌ను నిరంతరం బెదిరిస్తున్న, భారతీయుల మరణాలకు కారణమైన ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే హక్కు భారత్‌కు ఉందన్నారు.