NOTAM : బంగాళాఖాతం (Bay of Bengal) పై భారత్ నోటమ్ (NOTAM) జారీ చేసింది. ఫిబ్రవరి 5-6 తేదీల్లో బంగాళాఖాతంపై 3,190 కిలోమీటర్ల పరిధిలో విమానాలను అనుమతించబోమని ఎయిర్లైన్లకు నోటీసులు (NOTice to AirMen) ఇచ్చింది. గతంలో 2,530 కిలోమీటర్లు ఉన్న నోటమ్ పరిమితిని ఇప్పుడు సుమారు 3,190 కిలోమీటర్లకు పెంచినట్లు తెలుస్తోంది.
క్షిపణి పరీక్షల కోసం భారత్ ఈ నోటీసులు జారీచేసినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సముద్ర ఆధారిత క్షిపణి పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 5, 6 తేదీల్లో బంగాళాఖాతం గగనతలంలో ఎలాంటి పౌర విమానాలు ఎగరడానికి అనుమతి ఉండదని ఆ కథనాలు తెలిపాయి. కాగా క్షిపణుల ప్రయోగంపై భారత ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పెద్ద మొత్తంలో ఆయుధాలను సమకూర్చుకుంటున్నది. స్వదేశీ ఆయుధాల తయారీని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పలు క్షిపణి పరీక్షలను చురుకుగా నిర్వహిస్తున్నది.
నోటమ్ (NOTice to AirMen) అంటే ఎయిర్‌మెన్‌కు నోటీసులు ఇవ్వడం. నిర్దిష్ట గగనతలంలో నిర్దిష్ట కాలంలో ప్రమాదాలు, ప్రయాణ పరిమితుల గురించి పౌర, సైనిక విమానయానానికి తెలియజేసేందుకు ఇచ్చే అధికారిక నోటీసునే నోటమ్ అంటారు. సాధారణంగా క్షిపణి పరీక్షలు, రాకెట్ ప్రయోగాలు, సైనిక విన్యాసాలు లేదా యుద్ధ పరిస్థితులలో ముందస్తు హెచ్చరికగా ఈ నోటీసులు ఇస్తారు.