న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ శనివారం విడుదల చేసిన 2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో 180 దేశాల్లో భారత్ 157వ స్థానంలో ఉంది. 2025 సూచీలో భారత్ 151వ స్థానంలో ఉండగా ప్రస్తుత సంవత్సరం ఆరు స్థానాలు పతనమైంది. ఈ జర్నలిజం పర్యవేక్షక సంస్థను మొదట్లో రిపోర్టర్స్ శాన్స్ ఫ్రాంటియర్స్(ఆర్ఎస్ఎఫ్) అని పిలిచేవారు. తమ సూచికలపై 180 దేశాలు, భూభాగాల సగటు స్కోరు గత 25 ఏండ్లలో ఎన్నడూ ఇంత తక్కువగా లేదని ఆర్ఎస్ఎఫ్ పేర్కొన్నది. ఇండెక్స్ చరిత్రలో తొలిసారిగా ప్రపంచంలోని సగానికి పైగా దేశాలు ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ విషయంలో కష్టమైన లేదా చాలా తీవ్రమైన వర్గాలలోకి వచ్చాయి.
ఇండెక్స్ మొదటి స్థానంలో నార్వే, నెదర్లాండ్స్, ఎస్టోనియా, స్వీడన్ ఉండగా అట్టడుగు స్థాయిలో సౌదీ అరేబియా, ఇరాన్, చైనా, ఉత్తర కొరియా, ఎరిట్రియా ఉన్నాయి. కొన్ని అక్కడక్కడా మెరుగుదలలు ఉన్నప్పటికీ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పాత్రికేయ పరిస్థితులు ఆందోళనకర స్థాయిలో క్షీణించాయని ఈ సూచికను విశ్లేషిస్తే తెలుస్తున్నదని ఆర్ఎస్ఎఫ్ నివేదిక పేర్కొన్నది. ఎందుకంటే 180 దేశాలు, భూభాగాల్లో 100 దేశాలు తమ పత్రికా స్వేచ్ఛ స్కోరు దిగజారడాన్ని చూశాయని ఆర్ఎస్ఎఫ్ తెలిపింది.
గత సంవత్సర కాలంలో ఈ సూచిలోని చట్టపరమైన విభాగం అత్యధికంగా క్షీణించింది. ప్రపంచవ్యాప్తంగా జర్నలిజం నానాటికీ నేరంగా పరిగణించబడుతున్నదనడానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. అమెరికా ఖండంలో పరిస్థితి గణనీయంగా మారింది. అమెరికా ఏడు స్థానాలు దిగజారగా అనేక లాటిన్ అమెరికా దేశాలు హింస, అణచివేత అనే విషవలయంలోకి మరింతగా కూరుకుపోయాయి.
భారత్‌లో పత్రికా స్వేచ్ఛ సంక్షోభం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన పార్టీ పాత్రను ఎత్తిచూపుతూ ఆర్ఎస్ఎఫ్ ఇలా పేర్కొంది: జర్నలిస్టులపై హింస పెరగడం, మీడియా యాజమాన్యం అత్యధికంగా కేంద్రీకృతం కావడం, మీడియా సంస్థలు మరింత బహిరంగంగా అనుబంధాన్ని ప్రదర్శించడం వంటి కారణాలతో 2014 నుంచి బీజేపీ నాయకుడు, హిందూ జాతీయవాద మితవాదానికి ప్రతిరూపమైన ప్రధాని నరేంద్ర మోదీ పాలిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో ఉంది.
దేశంలో మీడియా రంగం విస్తృతి సమృద్ధిగా ఉన్నప్పటికీ 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి తన పార్టీ బీజేపీకి, మీడియాను శాసిస్తున్న పెద్ద కుటుంబాలకు మధ్య అద్భుతమైన సయోధ్యను కుదిర్చినప్పటి నుంచి భారత మీడియా అప్రకటిత అత్యవసర పరిస్థితిలోకి జారిపోయిందని ఆర్ఎస్ఎఫ్ తన భారతదేశ వాస్తవ నివేదికలో పేర్కొన్నది. ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూపు అధినేత ముకేశ్ అంబానీ 70కిపైగా మీడియా సంస్థలను కలిగి ఉన్నారని, అలాగే మోదీకి సన్నిహితుడైన మరో వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ 2022 చివరిలో ఎన్డీటీవీని కొనుగోలు చేయడం ప్రధాన స్రవంతి మీడియాలో బహుళత్వానికి ముగింపు పలికిందని ఆర్ఎస్ఎఫ్ పేర్కొన్నది. మోదీ పేరును, పెంపుడు కుక్కలు అనే పదాన్ని కలిపి గోదీ మీడియాగా పిలువడంతో దాని పెరుగుదలను గమనిస్తూ ఒత్తిడి, పలుకుబడి ద్వారా భారతీయ బహుళత్వ పత్రికా నమూనా ఎలా ప్రశ్నార్థకం అవుతున్నదని ఆర్ఎస్ఎఫ్ పేర్కొంది.
ప్రధానమంత్రి పత్రికా సమావేశాలు నిర్వహించరు. తనను సానుకూలంగా చిత్రీకరించే జర్నలిస్టులు, యూట్యూబర్లకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తారు. విధేయత చూపని వారిని తీవ్రంగా విమర్శిస్తారు. బీజేపీ మద్దతు ఉన్న ట్రోలర్లు భారతీయ జర్నలిస్టులను వేధింపులకు గురిచేస్తున్నారు అని ఆర్ఎస్ఎఫ్ పేర్కొన్నది. మీడియాను అణచివేయడానికి దేశద్రోహం, పరువు నష్టం, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన చట్టాలు వంటి వలసవాద కాలం నాటి చట్టాలను ఉపయోగించడానికి ప్రభుత్వాలు ఎన్నడూ వెనుకాడలేదు. ఉగ్రవాద నిరోధక చట్టాలను కూడా పాత్రికేయులకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అని ఆర్ఎస్ఎఫ్ అభిప్రాయం వ్యక్తం చేసింది.
భారతదేశ మీడియాకు ప్రధానంగా ప్రకటనల ఆదాయం ద్వారా నిధులు అందుతాయని, దీనికి ప్రధాన మూలం ప్రభుత్వమేనని తెలిపింది. ఈ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తమ కంటెంట్‌ను సెన్సార్ చేయమని మీడియాపై ఒత్తిడి తెచ్చే స్థితిలో ఉన్నాయని, అలా చేస్తున్నాయని ఆర్ఎస్ఎఫ్ పేర్కొంది. నరేంద్ర మోదీ హయాంలో ప్రకటనల కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని ఆర్ఎస్ఎఫ్ తెలిపింది. వార్తా సంస్థల్లో వైవిధ్యం కొరవడింది. పాత్రికేయ వృత్తి ముఖ్యంగా నిర్వాహక పదవుల్లో అగ్రవర్ణాలకు చెందిన హిందూ పురుషుల ప్రత్యేక హక్కుగా మిగిలిపోయింది.
ఈ పక్షపాతం కథనాలు, నివేదికల కోణాలు, విషయాలపై ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు ప్రధాన ఈవెనింగ్ టాక్ షోలలో అతిథులలో మహిళలు 15 శాతం కంటే తక్కువగా ఉన్నారు. హిందూ జాతీయవాద భావజాలం ఒక ఆధిపత్య శక్తిగా మారి సమకాలీన విషయాలను ప్రభావితం చేస్తూ రాజకీయ చర్చలకు ఒక చట్రాన్ని నిర్దేశిస్తూ భిన్నాభిప్రాయలే లేదా మైనారిటీ గొంతులు వినిపించే అవకాశాలను పరిమితం చేస్తున్నది అని ఆర్ఎస్ఎఫ్ నివేదిక పేర్కొంది.
భారతదేశ పొరుగు దేశాలలో దాదాపు అన్నీ భారత్ కంటే ఉన్నత స్థానంలో ఉన్నాయి. పాకిస్థాన్ 153వ స్థానంలో, భూటాన్ 150, నేపాల్ 87, శ్రీలంక 134, బంగ్లాదేశ్ 152వ స్థానంలో ఉన్నాయి. అయితే చైనా 178వ స్థానంలో ఉంది. 157వ స్థానంలో ఉన్న భారత్ పాలస్థీనా కంటే దిగువన ఉంది. గత రెండేళ్లుగా ఇజ్రాయెల్ పాలస్తీనాలో జాతి నిర్మూలనకు పాల్పడుతున్నది. 2024లో భారత్ 159వ స్థానంలో ఉండేది.
అంతేగాకుండా ప్రతి సంవత్సరం సగటున ఇద్దరు నుంచి ముగ్గురు జర్నలిస్టులు తమ వృత్తి కారణంగా హత్యకు గురవుతున్నందున మీడియా ప్రొఫెషనల్స్‌కు భారత్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటిగా ఉందని ఆర్ఎస్ఎఫ్ తన నివేదికలో తెలిపింది. ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులు నిత్యం ఆన్లైన్ వేధింపులు, బెదిరింపులు, శారీరక దాడులతోపాటు క్రిమినల్ విచారణలు, ఏకపక్ష అరెస్టులకు గురవుతున్నారు. వారు పోలీసు అధికారులు, రాజకీయ కార్యకర్తలతోపాటు క్రిమినల్ గ్యాంగులు, అవినీతిపరులైన స్థానిక అధికారుల నుంచి కూడా హింసకు గురి కావచ్చు. హిందూ అతివాద జాతీయవాద భావజాలమైన హిందూత్వ మద్దతుదారులు విమర్శకులను ద్రోహులు, దేశ వ్యతిరేకులుగా ముద్రవేసి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.
సోషల్ మీడియాలో భయంకరమైన, సమన్వయంతో కూడిన విద్వేషపూరిత ప్రచారాలు, హత్యలకు పిలుపు ఇస్తున్నారు. ఈ ప్రచారాలు ముఖ్యంగా మహిళా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకున్నపుడు చాలా హింసాత్మకంగా ఉంటున్నాయి. వారి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నారు. కశ్మీర్లో పర్యావరణ సమస్యలు లేదా వార్తలను కవర్ చేసే జర్నలిస్టులకు కూడా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. అక్కడ రిపోర్టర్లను పోలీసులు, పారామిలిటరీ దళాలు తరచుగా వేధిస్తున్నాయి. కొందరిని తాత్కాలిక నిర్బంధం పేరుతో చాలా సంవత్సరాల పాటు నిర్బంధిస్తున్నారు అని ఆర్ఎస్ఎఫ్ నివేదిక వివరించింది.