Crude oil | న్యూఢిల్లీ, మే 7: ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) దేశాల నుంచి చమురు దిగుమతులను భారత్ భారీగా తగ్గించేసింది. 2022 ఏప్రిల్‌లో భారత్ దిగుమతి చేసుకున్న మొత్తం చమురు లో ఒపెక్ దేశాల వాటా 72 శాతం ఉండగా, ఈ ఏప్రిల్‌లో అది 46 శాతానికి పడిపోయినట్టు చమురు ఎగుమతులు, దిగుమతులను లెక్కగట్టే వొర్టెక్సా సంస్థ పేర్కొన్నది.
ఒపెక్‌లో ఎక్కువగా మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలు ఉంటా యి. గతంలో దాదాపుగా 90 శాతం వరకు మన దేశం ఒపెక్ దేశాల నుంచే చమురు దిగుమతి చేసుకొనేది. గత ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టాక నాటో దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి.
రష్యా నుంచి చమురు దిగుమతిని నిలిపేశాయి. దీంతో భారత్‌కు రష్యా చౌకగా చమురు ఎగుమతి చేయడం ప్రారంభించింది. వరుసగా ఏడు నెలలుగా భారత్‌కు అత్యధికంగా ముడి చమురు ఎగుమతి చేస్తున్న దేశంగా రష్యా నిలిచింది. భారత్ దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురులో మూడింత ఒక వంతు రష్యా నుంచే వస్తున్నది. ఏప్రిల్‌లో భారత్ రోజుకు 46 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకోగా ఇందులో ఒపెక్ దేశాల వాటా రోజుకు 21 లక్షల బ్యారెళ్లు మాత్రమే.