న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ఉగ్రవాదమే కేంద్రంగా పాకిస్థాన్ విదేశాంగ విధానం ఉందని భారత్ విమర్శించింది. ఐక్య రాజ్య సమితి(ఐరాస)లో ఉగ్రవాదాన్ని కీర్తించడం ద్వారా పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తన నిజ స్వరూపాన్ని చాటుకున్నారని భారతీయ దౌత్యవేత్త పీటల్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో శుక్రవారం తన సమాధానం ఇచ్చే హక్కును ఆమె వినియోగించుకుంటూ తన దేశం ఎటువంటి కవ్వింపు లేకుండా తమపై దాడికి పాల్పడిందని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆపరేషన్ సిందూర్‌ని ప్రస్తావిస్తూ ఆరోపించారని చెప్పారు. పాక్ సాయుధ దళాలు భారత్ దాడిని శౌర్య పరాక్రమాలతో అత్యంత సమర్థంగా తిప్పికొట్టినట్లు షరీఫ్ చెప్పారని ఆమె తెలిపారు.
పహల్గాం ఉగ్ర దాడికి కారణమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ని కాపాడడం, అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించడం వెనుక పాక్ ఉందని గెహ్లాట్ చెప్పారు. ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా వాస్తవాలను కప్పి పుచ్చలేవని ఆమె స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ భూభాగంలోని పర్యాటకులను అమానుషంగా ఊచకోత కోసిన పాక్ ప్రాయోజిత ఉగ్ర సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను కాపాడిందని ఆమె ఆరోపించారు.