న్యూఢిల్లీ, జనవరి 31: భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అసాధారణ వేగంతో ప్రధాన నిర్ణయాలు, విధానాల అమలును దేశం వీక్షిస్తున్నదని, పేదలు, మధ్యతరతి ప్రజలు, యువత, మహిళలు, రైతులకు అత్యధిక ప్రాధాన్యతను తమ ప్రభుత్వం ఇస్తున్నదని ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు శుక్రవారం లోక్‌సభలో సమావేశమైన పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ తన ప్రభుత్వం మూడో పర్యాయంలో మూడు రెట్ల వేగంతో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని తెలిపారు.
60 నిమిషాలపాటు సాగిన తన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రభుత్వ గొప్పలను చెప్పుకొచ్చారు. మౌని అమావాస్య నాడు ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో జరిగిన తొక్కిపసలాటలో మృతిచెందిన భక్తులకు ఆమె సంతాపాన్ని ప్రకటించారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కూడా ఆమె నివాళులర్పించారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో ఉద యం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రసం గం ఉంటుంది. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కాగా, ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రాధా న్యం ఉంటుందని, పలు పన్ను సంస్కరణలు కూడా ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పాత పన్ను విధానాన్ని దశలవారీగా తొలగించే ప్రక్రియ ప్రారంభించవచ్చని చెప్తున్నారు. రూ.10 లక్షల లోపు ఆదాయం పొందే వారికి ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వొచ్చనే అంచనాలున్నాయి.