న్యూఢిల్లీ: భారత దేశపు తొలి మానవ సహిత సముద్ర గర్భ పరిశోధక వాహనం (సబ్మెర్సిబుల్) మత్స్య 6000ను ఆవిష్కరించారు. ఇది ముగ్గురు వ్యక్తులను తీసుకెళ్లగలదు. సముద్రపు లోతుల్లో పరిశోధనల నిర్వహణకు సైంటిఫిక్ పరికరాలు దీనిలో ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
సముద్రంలో అత్యంత లోతులో అన్వేషణ, పరిశోధన జరపగలిగే కొన్ని దేశాల సరసన చేరడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని చెప్పారు. పంచకులలో జరిగే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఉత్సవాల్లో దీనిని ప్రదర్శిస్తారు. ఇది 2026 నాటికి మానవ సహితంగా తొలిసారి 500 మీటర్ల లోతుకు వెళ్తుంది. మరింత సవాళ్లతో కూడిన 6,000 మీటర్ల లోతు వరకు సముద్రంలో మునిగి కార్యకలాపాలను నిర్వహించే స్థాయికి 2027 నాటికి చేరుకుంటుంది.