న్యూఢిల్లీ, జూలై 7: వాహనాలు, గృహోపకరణాలు, పరిశ్రమలతో నగరాల్లో కాలుష్యం రోజు రోజుకూ పెరిగిపోతున్నది. దీంతో ప్రజల్లో శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కాలుష్యానికి చెక్ పెట్టెందుకు ‘మొబైల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీ’ని ఒక పరిష్కారంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాము మొబైల్ లిక్విడ్ ట్రీని అభివృద్ధి చేశామని సీఎస్ఐఆర్-సీఐఎమ్ఎఫ్ఆర్ పరిశోధకులు ప్రకటించారు. రద్దీ నగరాల్లో ఇమిడిపోయేలా దేశంలో తొలిసారి ఈ వాయుశుద్ధి వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇదొక ట్యాంక్ లాంటి నిర్మాణం.
ఇందులోని మైక్రో ఆల్గే (నాచు) చెట్లలాగే కార్బన్డయాక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. దాంతో గాలిలో నాణ్యత మెరుగుపడుతుందని సీఐఎంఎఫ్ఆర్ సీనియర్ సైంటిస్ట్ వెట్రివేల్ అంగుసెల్వి మీడియాకు వెల్లడించారు. పాఠశాలలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, పార్కులు, సినిమా హాళ్ల వద్ద వీటిని ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. సాధారణంగా ఇది చెట్ల కంటే 10 నుంచి 50 రెట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తుందనే అంచనాలు ఉన్నాయి.