Hydrogen Train | భారతీయ రైల్వేలు సరికొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నాయి. ప్రస్తుతం డీజిల్ నుంచి ఎలక్ట్రికల్ లోకోమోటివ్‌లకు మార్చింది. తాజాగా రైల్వేశాఖ దేశంలోనే తొలి హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ నెల 31 నాటికి హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ సంస్థ (RDSO) భారతదేశపు తొలి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు డిజైన్‌ను రూపొందించింది. ఇది రైలు రవాణాలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఈ రైలులో హైడ్రోజన్ సిలిండర్లను నిల్వ చేసేందుకు, ఇంటిగ్రేటెడ్ ఫ్యూయల్ సెల్ కన్వర్టర్లు, ఎయిర్ రిజర్వాయర్లను ఉంచేందుకు మూడు ప్రత్యేక కోచ్‌లు ఉంటాయి. రైలు గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.
‘హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్’ ఇన్నోవేషన్ కింద 35 హైడ్రోజన్ పవర్‌తో నడిచే రైళ్లను 35 వరకు నడపాలని భారతీయ రైల్వే భావిస్తున్నది. ప్రతి రైలుకు దాదాపు రూ.80 కోట్లు ఖర్చు అవనున్నది. హెరిటేజ్, హిల్‌స్టేషన్స్ రూట్స్‌లో ఈ రైళ్లను నడపాలని భావిస్తున్నది. గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అదనంగా రూ.70కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ హైడ్రోజన్‌తో నడిచే రైళ్లతో లాభాలున్నాయి. రైళ్ల నుంచి వెలువడే కార్బన ఉద్గారాలు సున్నాశాతం.. ఎక్కువ సామర్థ్యం, దీర్ఘకాలిక ఖర్చు ఆదా, సౌండ్ పొల్యూషన్ తక్కువ తదితర ప్రయోజనాలున్నాయి. ఉత్తర రైల్వేలోని జింద్-సోనిపట్ విభాగంలో ఆపరేషన్ కోసం అవసరమైన గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు.. ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU) రేక్‌పై హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌ను రెట్రోఫిట్ చేసేందుకు రైల్వేశాఖ రూ.111.83కోట్లుతో పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టింది.