న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి.. రాజ్యసభ చైర్మెన్( Rajya Sabha chairman) జగదీప్ ధన్కడ్పై.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచనల్లో ఉన్నది. ఎగువ సభలో చైర్మన్ వ్యవహరిస్తున్న తీరు ఏకపక్షంగా ఉంటున్నట్లు ఆ పార్టీ ఆరోపించింది. బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరస్తో కాంగ్రెస్ నేతలు లింకు పెట్టుకున్నట్లు బీజేపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొన్నది. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. సభాపక్ష నేత, ప్రతిపక్ష నేతలతో ధన్కడ్ సమావేశం నిర్వహించారు.
సభను సజావుగా సాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఐక్యత, సార్వభౌమత్వం.. దేశానికి పవిత్రమైనవని, ఆ ఐకమత్యాన్ని, సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడాన్ని సహించబోమని ధన్కడ్ తెలిపారు. మంగళవారం ఉదయం 10.30కు మరోసారి నేతలు కలుసుకోనున్నట్లు చెప్పారు.
అవిశ్వాస తీర్మానంపై ఇండియా కూటమి పార్టీ నేతలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్ సంతకం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్67(బి) కింద ఆ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు.