న్యూఢిల్లీ, డిసెంబర్ 18: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం సంచలన ప్రకటన చేశారు. బెంగాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బెంగాల్లో 34 ఏండ్ల వామపక్ష పాలనకు ముగింపు పలుకుతూ 2011లో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లెఫ్ట్‌తో జట్టుకు మమత గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్న నేపథ్యంలో మమత ఈ ప్రకటన చేశారు. మరోవైపు, ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిని 2024 సాధారణ ఎన్నికల తర్వాత నిర్ణయిస్తామని.. సీట్ల సర్దుబాటుతో పాటు కూటమిలోని మిగతా సమస్యలన్నీ పరిష్కరించుకొని బీజేపీని ఓడిస్తామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. హిందీ బెల్ట్‌లో బీజేపీ బలంగా లేదని.. తాము బలహీనంగా ఉన్నామని.. ఈ సమస్యను అధిగమించేందుకు తామంతా కలిసి పని చేయాలని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ జమీందారీ సంస్కృతిని విడనాడి మమతా బెనర్జీ లాంటి సీనియర్ నాయకులకు కూటమి పగ్గాలు అప్పగించాలని టీఎంసీ కోరింది.