న్యూఢిల్లీ : మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్ధానికంగా తయారీని ప్రోత్సహించేందుకు డ్రోన్ల దిగుమతిని భారత్ నిషేధించింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. సంబంధిత క్లియరెన్సులతో ఆర్అండ్డీ, విద్య, భద్రత, రక్షణ రంగ అవసరాల కోసం డ్రోన్ల దిగుమతికి మినహాయింపులు ఇచ్చింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం డ్రోన్ల దిగుమతిపై నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రైవేట్ డ్రోన్స్పై సంపూర్ణ నిషేధం విధించిన ప్రభుత్వం నిషేధం నుంచి డ్రోన్ విడిభాగాలను మినహాయించింది.
డ్రోన్ పరికరాల దిగుమతికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులు స్పష్టం చేశాయి. ఇక మినహాయింపులకు అనుగుణంగా ప్రభుత్వ సంస్ధలు, విద్యా సంస్ధలు, ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఆర్అండ్డీ సంస్ధలు డ్రోన్లను దిగుమతి చేసుకునేందుకు అనుమతిస్తారు. సంబంధిత మంత్రిత్వ శాఖల ద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ డ్రోన్ల దిగుమతికి ఆయా సంస్ధలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. భారత్లో శైశవ దశలో ఉన్న డ్రోన్ల తయారీని ముమ్మరంగా ప్రోత్సహించేందుకే డ్రోన్ల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచంలో టాప్ డ్రోన్ తయారీదారులు చైనాలోనే అధికంగా ఉండటం విడిపరికరాలకు సైతం భారత్ సహా అనేక దేశాలు చైనాపైనే ఆధారపడటంతో దేశీ పరిశ్రమను ప్రోత్సహించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. వెలుపలి నుంచి సరఫరాలపై ఆంక్షలు విధిస్తే సహజంగానే దేశీ డ్రోన్ తయారీదారుల ఉత్పత్తులకు స్ధానిక డిమాండ్ ఊపందుకుంటుంది. దేశంలో డ్రోన్ తయారీ పరిశ్రమకు ఊతమిచ్చేందుకు కేంద్రం ఇప్పటికే రూ 120 కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రకటించింది. డ్రోన్ తయారీ పరిశ్రమలో రూ 5000 కోట్లకు పైగా పెట్టుబడులు సమకూరతాయని, ఈ రంగంలో 10,000కుపైగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది.