న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రెండు రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, మరణాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం 6 వందల మందికిపైగా మరణించగా, నేడు ఆ సంఖ్య 870కి చేరింది. పాజిటివ్ కేసులు తగ్గుతుండటంతో పాజిటివిటీ రేటు కూడా పడిపోతున్నది.
దేశవ్యాప్తంగా 2,35,532 పాజిటివ్ కేసులు నమోదవగా, 871 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,08,58,241కి చేరగా, మరణాలు 4,93,198కి పెరిగాయి. మొత్తం కేసుల్లో 3,83,60,710 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, మరో 20,04,333 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 3,35,939 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు 4.91 శాతం ఉండగా, రోజువారీ పాజిటివిటీ రేటు 13.39 శాతంగా ఉందని తెలిపింది. రికవరీ రేటు 93.86 శాతానికి తగ్గిందని పేర్కొన్నది. జనవరి 26తో ముగిసిన వారంతో దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికిపైగా ఉందని వెల్లడించింది.
ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 1,65,04,87,260 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో 95 శాతం మంది వయోజనులు మొదటి డోసు తీసుకున్నారని, 74 శాతం మంది పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేయించుకున్నారని వెల్లడించింది.