న్యూఢిల్లీ: దేశంలో మహిళల కనీస వివాహ వయసును 18 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమాజ్వాది పార్టీ సీనియర్ నేత, ఎంపీ షఫీకుర్ రెహమాన్ బర్క్ తప్పుబట్టారు. భారత్ చాలా పేద దేశమని, ఈ దేశంలో ప్రతి తల్లీతండ్రీ తమ బిడ్డలకు తొందరగానే వివాహం చేయాలని కోరుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల వివాహ వయసు పెంపునకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే తాను మద్దతివ్వబోనని బర్క్ వ్యాఖ్యానించారు.
దేశంలో మహిళల కనీస వివాహ వయసు 18 ఏండ్లుగా ఉండేది. అయితే దీన్ని 18 నుంచి 21 ఏండ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ అంశానికి సంబంధించి బిల్లును సిద్ధం చేసి ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదముద్ర వేయించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో షఫీకుర్ రెహమాన్ బర్క్ తాజా వ్యాఖ్యలు చేశారు.