న్యూఢిల్లీ: భారతీయులు అత్యంత ఇష్టంగా తినే ఆహారం ఏమిటో తెలుసా? ఇంకేముంది బిర్యానీనే! 2025లో కూడా మనవాళ్ల ఇష్టమైన ఆహారంగా ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది భారతీయులు 9.3 కోట్ల బిర్యానీలు ఆర్డర్ చేశారు. అంటే ప్రతి నిముషానికి 194, ప్రతి సెకనుకు 3.25 బిర్యానీలు ఆర్డర్ చేసినట్టు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ గణాంకాలు వెల్లడించాయి. మొత్తం బిర్యానీలలో 5.77 కోట్లు చికెన్ బిర్యానీలే ఉన్నాయి. అత్యంత ఇష్టంగా తినే రెండో ఆహారంగా బర్గర్ నిలిచింది. దీనిని 4.42 కోట్ల మంది ఆర్డర్ చేశారు. ఇక 4.01 కోట్లతో మూడో స్థానంలో పిజ్జా నిలిచింది.
ఈ పోటీలో శాకాహార దోసె కూడా నిలిచింది. 2.62 కోట్ల ఆర్డర్‌తో అది దాని ప్రత్యేకతను నిలుపుకొన్నది. మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు అత్యధికంగా ఇష్టపడే ఆహారంగా బర్గర్స్ నిలిచింది. చికెన్ బర్గర్లు 63 లక్షలు, వెజ్ బర్గర్లు 42 లక్షలు అమ్ముడయ్యాయి. తర్వాత స్థానాలను చికెన్ రోల్స్, వెజ్ పిజ్జాలు, చికెన్ నగ్గెట్స్లు ఆక్రమించాయి.
స్నాక్స్ టైమ్‌లో చాయ్, సమోసాలు ప్రత్యేకతను చాటుకున్నాయి. ఈ సమయంలో 34.2 లక్షల సమోసాలు, 29 లక్షల కప్పుల చాయ్ అమ్ముడయ్యాయి. ఈ ఏడాది డెజర్ట్‌లు (భోజనం అనంతరం తినే తీపి పదార్థ్ధం) కూడా తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. 69 లక్షలతో వైట్ చాక్లెట్ కేకు మొదటి స్థానంలో నిలువగా, 54 లక్షలతో చాక్లెట్ కేక్, 45 లక్షలతో గులాబ్ జామూన్ ఇష్టమైన పదార్థాలుగా నిలిచాయి.