ముంబై: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)లో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టవిరుద్ధమైన సవరణలను వెంటనే నిలిపివేయకపోతే జూలై 5 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని సామాజిక కార్యకర్త అన్నా హజారే మంగళవారం హెచ్చరించారు. ఈ నెల 12న ప్రభుత్వం చేసిన సవరణలు ఆర్టీఐ చట్టం స్ఫూరిని దెబ్బతీయడమే కాక, దాని పారదర్శకతను బలహీనపరుస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఒక లేఖ రాస్తూ మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనలు ఆ చట్టం తీవ్రతను తగ్గించడమే కాక, సమాచార సేకరణ నుంచి ప్రజలను దూరం చేస్తుందని ఆరోపించారు.
అలాగే ఆర్టీఐ సమాచార సేకరణకు ఫీజును పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆర్టీఐ అన్నది ఆదాయాన్ని సృష్టించే చట్టం కాదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దాని ఫీజును 20 ఏండ్ల తర్వాత పెంచితే, సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్న అధికారులపై కూడా జరిమానాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. దరఖాస్తుదారులు ఐడీ ప్రూఫ్‌ను సమర్పించాలన్న నిబంధనను ఆయన ప్రస్తావిస్తూ ఆర్టీఐ చట్టం ప్రకారం దరఖాస్తుదారుడు తన సమాచారాన్ని కోరడానికి గల కారణాలను వివరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.