న్యూఢిల్లీ, జవనరి 13: దేశంలో ఒక శాతం అక్షరాస్యత పెరిగితే అది 25 శాతం మహిళా ఓటర్లు, వారి ఓటింగ్ శాతం పెరుగుదలకు దారి తీస్తుందని భారత స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) ఓ నివేదికలో వెల్లడించింది. దేశంలో అక్షరాస్యత, మహిళా ఓటర్ల పెరుగుదలకు మధ్య సంబంధం ఉందని నివేదిక పేర్కొంది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికలలో మహిళా ఓటర్ల సంఖ్య 1.8 కోట్లు పెరిగిందని, వీరిలో 45 లక్షల మంది ఓటర్ల పెంపునకు అక్షరాస్యత మెరుగుదలే కారణమని నివేదిక తెలిపింది.
మహిళా ఓటర్ల పెంపుదలకు అక్షరాస్యతతోపాటు ఉపాధి, ఇంటి యాజమాన్యహక్కు వంటి అంశాలు కూడా చాలా ముఖ్యమైన కారణాలని నివేదిక పేర్కొంది. ప్రధాన మంత్రి ముద్ర యోజన వంటి ఉపాధి పథకాలు 36 లక్షల మంది అదనపు మహిళా ఓటర్లను కల్పించడంలో కీలక పాత్ర పోషించాయని నివేదిక తెలిపింది. పారిశుధ్య సౌకర్యాల కల్పన కారణంగా 21 లక్షల అదనపు మహిళలు ఓటర్లుగా రిజిస్టర్ అయినట్టు నివేదిక తెలిపింది.