లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరుగనున్న మేయర్ ఎన్నికల్లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ భార్య, ఆయన కుటుంబ సభ్యులను ప్రయాగ్‌రాజ్ నుంచి పోటీకి దించబోమని బీఎస్సీ అధినేత్రి మాయావతి (Mayawati) తెలిపారు. జనవరి 5న బీఎస్పీ సీనియర్ నేతల సమక్షంలో తమ పార్టీలో చేరిన అతిక్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్‌పై కేసు నమోదైన నేపథ్యంలో ఆమెను పార్టీలో కొనసాగించడంపై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ పద్ధతితో నిర్వహించాలని మాయావతి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికల్లో బీఎస్పీ పూర్తిస్థాయిలో పోటీ చేస్తుందని వెల్లడించారు.
కాగా, 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ కిడ్నాప్, హత్య కేసులో కీలక సాక్షి అయిన ఉమేష్ పాల్‌ను ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లో కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ కేసులో అతిక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్, అతిక్ భార్య పర్వీన్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే బీఎస్పీలో చేరిన తర్వాత ప్రయాగ్‌రాజ్ మేయర్ స్థానం నుంచి పోటీ చేస్తానని ఆమె తెలిపారు. దీని కోసం మాయావతిని కోరుతానని అన్నారు.
మరోవైపు బీఎస్పీ సీనియర్ నేత, రాస్రా ఎమ్మెల్యే ఉమా శంకర్ సింగ్ గత నెలలో అతిక్ అహ్మద్ భార్య పర్వీన్‌కు మద్దతుగా మాట్లాడారు. ప్రయాగ్‌రాజ్ మేయర్ కావడానికి పర్వీన్ సిద్ధంగా ఉన్నారని, బీజేపీ ఆ స్థానాన్ని కోల్పోతుందని అన్నారు. దీంతో మేయర్ ఎన్నికల బరిలో పర్వీన్ దిగుతారంటూ ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి తాజాగా దీనికి తెరదించారు. పోలీస్ కేసు నేపథ్యంలో అతిక్ అహ్మద్ భార్య, ఆయన కుటుంబ సభ్యులను ప్రయాగ్‌రాజ్ మేయర్ స్థానంలో పోటీకి దించబోమని స్పష్టం చేశారు.
Also Read: