బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం 9 లోక్‌సభ స్థానాలు ఉండగా, వచ్చే ఎన్నికల్లో అదనంగా మరో 2 సీట్లను గెలుచుకోబోతున్నదని టైమ్స్ నౌ – ఈటీజీ రిసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇక ‘ఇండియా టీవీ-సీఎన్ఎక్స్’ నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ సునాయాసంగా 8 లోక్‌సభ సీట్లు గెలుచుకుంటుందని వెల్లడైంది.
BRS | హైదరాబాద్, అక్టోబర్ 2 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తే తెలంగాణలో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధిస్తుందని స్పష్టం చేశాయి. ప్రస్తుతం బీఆర్ఎస్కు ఉన్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ‘టైమ్స్ నౌ’, ‘ఇండియా టీవీ’ న్యూస్ చానల్స్ వేర్వేరుగా నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. ఈ సంస్థలు సోమవారం తమ సర్వే నివేదికలను విడుదల చేశాయి. బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం 9 లోక్‌సభ స్థానాలు ఉండగా, వచ్చే ఎన్నికల్లో అదనంగా మరో 2 సీట్లను గెలుచుకోబోతున్నదని టైమ్స్ నౌ – ఈటీజీ రిసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇక ‘ఇండియా టీవీ-సీఎన్ఎక్స్’ నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ 8 లోక్‌సభ సీట్లు సునాయాసంగా గెలుచుకుంటుందని పేర్కొంది. ఈ రెండు జాతీయ మీడియా సంస్థలు వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికలపై సర్వేలు నిర్వహించినప్పటికీ, స్థానిక అంశాల ఆధారంగా జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ మరింత ఎక్కువ ప్రభావం చూపించనుందని పరోక్షంగా వెల్లడైంది.
టైమ్స్ నౌ-ఈటీజీ రిసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ మొత్తం 17 లోక్‌సభ సీట్లకు గాను 11 సీట్లు గెలుచుకోబోతున్నదని పేర్కొన్నది. కాగా 11 లోక్‌సభ స్థానాలు దాదాపు 77 అసెంబ్లీ సీట్లకు (ఒక్కో నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు) సమానం. లోక్‌సభ ఎన్నికలలో ఓటర్లను జాతీయ అంశాలు కొంత ప్రభావితం చేస్తుండగా.. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి స్థానిక పార్టీ ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. దాదాపు 77 అసెంబ్లీ సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంటుందని సర్వేలో తేలడంతో ఈ లెక్కన వంద సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పరోక్షంగా చాటింది. గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ 88 సీట్లు గెలుచుకొని ప్రభంజనం సృష్టించింది. తాజా సర్వేలోనూ తెలంగాణలో బీఆర్ఎస్ బలం చెక్కుచెదరలేదని తేలింది. ఈ సారి ఎన్నికలలో వంద సీట్లు గ్యారంటిగా గెలుస్తామని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పలు సంధర్భాల్లో ప్రకటించారు. ఈ అంచనాలకు దరిదాపుల్లోనే తాజా సర్వేలు ఉండటంతో.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించబోతున్నదని తేల్చిచెప్పినట్టు అయింది.
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి మూడో స్థానమేనని టైమ్స్‌నౌ-ఈటీజీ రిసెర్చ్ సర్వే తేల్చిచెప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీది మూడోస్థానమేనని ఇప్పటికే పలు సర్వే సంస్థలు తేటతెల్లం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ 2-3 సీట్లు మాత్రమే గెలుచుకొనే అవకాశం ఉన్నదని ఈ సర్వేలో తేలింది. కాగా, ఇండియా టీవీ సీఎన్ఎక్స్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో మాత్రం బీజేపీ రెండో స్థానంలో ఉంటుందని, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంటుందని వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం బీఆర్ఎస్ 8 స్థానాలు, బీజేపీ 6 సీట్లు, కాంగ్రెస్ 2 స్థానాలు, ఇతరులు ఒక సీటును గెలుచుకోనున్నట్టు తేలింది.