చెన్నై: తమిళనాడు(Tamilnadu) అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే , బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 27 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నది. అయితే ఓ సీటు కోసం మాత్రం బీజేపీలో కుమ్ములాట సాగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జోక్యం చేసుకున్నా.. ఇద్దరు నేతలు మాత్రం ఆ సీటు కోసమే పట్టుబడినట్లు సమాచారం. ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై, మహిళా మోర్చా చీఫ్ వనతి శ్రీనివాసన్.. ఒకే సీటు కోసం పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరూ కోయంబత్తూరు నార్త్ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. 27 సీట్లను పంచుకునే క్రమంలో జరిగిన మీటింగ్లో ఇద్దరు నేతలు కోయంబత్తూరు సీటు కోసం పట్టుపట్టినట్లు తెలుస్తోంది.
సీటు షేరింగ్ వల్ల సింగనల్లూరు, కవుందంపాల్యం సీట్లను ఏఐఏడీఎంకేకు కేటాయించారు. అయితే కోయంబత్తూరు నార్త్ సీటును వనతి శ్రీనివాసన్కు కేటాయించారు. కానీ అన్నామలై కూడా కోయంబత్తూరు బర్త్ను కోరుకుంటున్నారు. దీంతో ఆ ఇద్దరి మధ్య ఇంటర్నల్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వనతి శ్రీనివాసన్ చాన్నాళ్ల నుంచి ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్నారని, ఈ దశలో ఆ స్థానాన్ని మరొకరికి కేటాయించలేమని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. కానీ ఇదే ప్రాంతం నుంచి పోటీ చేయాలని అన్నామలై కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతల్లో ఒకర్ని రామనాథపురం నుంచి పోటీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.