ముంబై: ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను ఆయన ప్రశంసించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయానికి ఆ సంస్థ ప్రధాన కారణమని అన్నారు. ముంబైలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి శరద్ పవార్ మాట్లాడారు. గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఆర్ఎస్ఎస్ పని విధానం, దాని దూకుడు, హిందూత్వ ప్రచారం వంటివి కీలక స్తంభాలని తెలిపారు. అందుకే 149 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 132 సీట్లు గెలుచుకున్నదని అన్నారు.
కాగా, అంకితభావంతో పనిచేసే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీ విజయానికి ఒక ఉదాహరణ అని శరద్ పవార్ తెలిపారు. అట్టడుగుస్థాయి వరకు ఆ సంస్థ కీలకంగా పని చేసిందని ఆయన కొనియాడారు. 17 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) ఓటు బ్యాంకు విశ్వాసాన్ని బీజేపీ తిరిగి పొందడం కూడా ఎన్డీయే విజయానికి కారణాలని అన్నారు.