న్యూఢిల్లీ: ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు ప్రయాణిస్తున్న బైక్ ఒక వ్యక్తి స్కూటీకి తగిలింది. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన అతడు ఫ్లైఓవర్ పైనుంచి బైక్‌పై వెళ్తున్న ఆ కుటుంబంపై కాల్పులు జరిపాడు. (Man Shoots At Family From Flyover) మహిళ మెడ భాగంలోకి బుల్లెట్ చొచ్చుకెళ్లడంతో ఆమె మరణించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. బుధవారం హీరా సింగ్, తన భార్య అయిన 30 ఏళ్ల సిమ్రంజీత్ కౌర్, నాలుగు, 12 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కుమారులతో కలిసి బైక్‌పై ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్‌కు వెళ్తున్నాడు. అయితే గోకల్‌పురి ఫ్లైఓవర్ సమీపంలో ఒక వ్యక్తి డ్రైవ్ చేస్తున్న స్కూటీకి వారి బైక్ తగిలింది. దీంతో ఆ వ్యక్తి, హీరా సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది.
కాగా, ఒకరినొకరు తిట్టుకుంటూ తమ తమ టూ వీలర్స్‌పై వెళ్లసాగారు. ఫ్లైఓవర్ పక్కగా ఉన్న రోడ్డుపై హీరా సింగ్ బైక్ నడపగా, ఫ్లైఓవర్ పైన ఆ వ్యక్తి స్కూటీని డ్రైవ్ చేశాడు. అయితే ఉన్నట్టుండి అతడు ఫ్లైఓవర్ పక్కగా బైక్‌పై వెళ్తున్న హీరా సింగ్ కుటుంబంపై 35 అడుగుల దూరం నుంచి గన్‌తో కాల్పులు జరిపాడు. హీరా సింగ్ భార్య సిమ్రంజీత్ కౌర్ మెడలోకి బుల్లెట్ చొచ్చుకెళ్లింది. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. గురు తేగ్ బహదూర్ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆ మహిళ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు హీరా సింగ్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లల ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ లెక్కచేయక ఆ కుటుంబంపై కాల్పులు జరిపి ఇద్దరు పిల్లల తల్లి మరణానికి కారణమైన నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితుడ్ని గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.