Nirmala Sitaraman | భారత్‌లో మహిళల ఎదుగుదలను పితృస్వామ్య వ్యవస్థ అడ్డుకుంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఎలా అయ్యారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బెంగళూరులో సీఎంఎస్ బిజినెస్ స్కూల్ విద్యార్థులతో జరిగిన చర్చాగోష్టిలో ఆమె మాట్లాడుతూ దేశంలో స్త్రీ, పురుష వివక్ష లేదని, సమానత్వం ఉందన్నారు. మహిళలు తమ కోసం తాము నిలబడటంతోపాటు తర్కబద్ధంగా మాట్లాడితే ఏ పితృస్వామ్య వ్యవస్థ మహిళల్ని, వారి ఎదుగుదలను అడ్డుకోలేదన్నారు. అయితే, మహిళలకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
21-24 ఏండ్ల మధ్య వయస్సుల గల నిరుద్యోగ యువతకు కోటి ఇంటర్న్ షిప్ లతోపాటు వారికి ఉపాధి కల్పనకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటున్నదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు మద్దతుగా పని చేస్తున్నదని తెలిపారు. ఈ రంగం నుంచే 40 శాతం కేంద్ర ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్ ఉందన్నారు. దేశంలో రెండు లక్షలకు పైగా స్టార్టప్ కంపెనీలు ఉంటే, వాటిలో 130కి పైగా యూనికార్న్‌లు అవతరించాయని, కానీ పూర్తి స్థాయిలో అవకాశాలు కల్పించలేక పోయామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇన్నోవేటర్లకు అనుకూల వాతావరణం క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నదని తెలిపారు.